ప్రధాని మోడీని హత్య చేయనున్నట్లు బెదిరింపు..

Threat to PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయనున్నట్లు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు లేఖ వచ్చింది. ముంబైలోని ఎన్ఐఏ కార్యాలయానికి ఓ ఈ-మెయిల్ వచ్చింది. 20 కిలోల ఆర్డీఎక్స్ తన వద్ద ఉందని ఈ-మెయిల్లో ఆగంతకుడు తెలిపాడు. కోట్లాదిమందిని హత్య చేసేందుకు కుట్ర రచన చేసినట్లు అందులో పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో పెద్దఎత్తున దాడులకు పథకం వేసినట్లు చెప్పాడు. 2 కోట్ల మందిని చంపాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు హెచ్చరించాడు. వీలైనంత త్వరగా ప్రధాని మోడీని హత్య (Threat to PM Modi) చేయనున్నట్లు స్పష్టం చేశాడు. ఇందుకోసం కొంతమంది ఉగ్రవాదులను కలిసినట్లు పేర్కొన్నాడు.
దాడులకు అవసరమైన ఆర్డీఎక్స్ సమకూర్చనున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు పేర్కొన్నాడు. దాడుల కోసం అవసరమైన బాంబులను సులభంగా సేకరించినట్లు తెలిపాడు. ఫిబ్రవరి 28న 20మంది స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసినట్లు పేర్కొన్నాడు. ఒకవేళ తనను ఆపాలనుకుంటే ప్రయత్నించి చూడాలంటూ సవాల్ విసిరాడు. ప్రధాని మోడీకి బెదిరింపు ఈ-మెయిల్ ఘటనపై ఎన్ఐఏ అప్రమత్తమైంది. దర్యాప్తు మొదలుపెట్టడటంతోపాటు ప్రధాని మోడీ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు చర్యలు చేపట్టింది.